నటీనటులు: సునీల్..మన్నారా
చోప్రా. నాగినీడు. కబీర్‌ఖాన్.సత్య ప్రకాష్.రాజా రవీందర్. పృథ్వీ. సూర్య. అదుర్స్ రఘు తదితరులు
చాయాగ్రహణం: సి.రాంప్రసాద్
సంగీతం:
దినేష్
నిర్మాత:
ఆర్.సుదర్శన్‌రెడ్డి
దర్శకత్వం: వంశీకృష్ణ ఆకెళ్ళ
సంస్థ:
ఆర్.పి.ఎ.క్రియేషన్స్
విడుదల:
29-07-2106
కథ : ఓ బడిపంతులు (నాగినీడు) కొడుకు గణేష్ (సునీల్). చిన్నప్పుడు తరగతి గదిలో తన
తండ్రి చెప్పిన ఓ నీతి కథ ప్రకారం తనకి
సాయం చేసినవాళ్లని గుర్తు పెట్టుకొని మరీ తిరిగి సాయం చేస్తుంటాడు. ఎదుటివాళ్లు ‘నీ సాయం వద్దురా బాబోయ్’ అన్నా అతను మాత్రం వదిలిపెట్టడు. చిన్నప్పుడు ఓ రౌడీ (జీవీ) చేతిలో
నుంచి తృటిలో తప్పించుకొని ప్రాణాలతో బయటపడతాడు గణేష్. తను ప్రాణాలతో బయటపడ్డానికి
కారణం మరో రౌడీ బైరాగి (కబీర్‌ఖాన్) అని
తెలుసుకుంటాడు.
అతన్ని
మనసులో పెట్టుకొని మరీ పెద్దయ్యాక తిరిగి
సాయం చేయడానికి సిద్ధమవుతాడు. బైరాగిని
చంపాలనుకొన్న రౌడీలని ఓ కంట కనిపెడుతూ తన ప్రాణాల్ని అడ్డేస్తుంటాడు. అదే సమయంలో బైరాగి చెల్లెలి(మన్నారా
చోప్రా)ని చూసి ప్రేమలో పడతాడు. అయితే
అప్పటిదాకా బైరాగి ఎవరో బయటి ప్రపంచానికి తెలియదు. గణేష్ కారణంగా అందరికీ తెలిసిపోతుంది.
పోలీసులు వెంటపడతారు. దీంతో గణేష్‌ని చంపాలని
అనుకుంటాడు బైరాగి. తనకి సాయం చేస్తూ వచ్చిన గణేష్‌ని చంపాడా? తనని చంపాలనుకొన్నా బైరాగికి గణేష్
సాయంగా నిలిచాడా?
లాంటివి తెలుసుకోవాలంటే వెండితెర మీదనే చూడాలి.
దర్శకత్వ విశ్లేషణ: సాయం చేసిన మనిషికి తిరిగి సాయం చేయడం అన్నది ‘జక్కన్న’ కోసం దర్శకుడు వంశీకృష్ణ ఆకెళ్ళ ఎంచుకున్న కథాంశం. తెలిసిందే అయినా
కట్టుదిట్టుగా కథనం అల్లుకుంటే హిట్టు కొట్టడం కష్టమేమీ కాదు. అయితే జక్కన్న సాయం
ఎలా ఉందంటే జక్కన్నకి కాదు కదా మరో మనిషికి కూడా ఇంకెప్పుడూ సాయం చేయకూడదు
అనుకునే పరిస్థితి. ఈ పాయింట్ ఏదో కామెడీ పండిస్తుందంటే దానికి
దర్శకుడు రాసుకున్న కథనం కంటిమీద వాతలు పెట్టినట్టుంది. అప్పట్లో వర్మ ‘ఫూంక్’ సినిమాని ‘రక్ష‘ పేరుతో రీమేక్ చేసిన
వంశీకృష్ణ దాదాపు ఆరేళ్ల తర్వాత చేస్తోన్న రెండో సినిమా ‘జక్కన్న’లో సునీల్‌ను కొత్తగా
చూపిస్తానని చెప్పుకొచ్చాడు. ఆ
కొత్తదనం మరేంటో కాదు. సునీల్‌కి
యాక్షన్ ఇమేజ్ పులమడం. దీనికోసం యదావిధిగా
ఓ రౌడీని బకరా చేయడం, వాడి చెల్లెలితో
ప్రేమాయణం చివరికి ఆ రౌడీని మార్చడం
ఇలా పరమ బోరింగ్‌గా సాగుతుంది సినిమా.
డేగ (జీవీ)ని చంపి రౌడీగా
ఫేమస్ అయిన బైరాగి గణేశ్‌కి సాయపడిన తీరు,
పదిహేనేళ్ళ తర్వాత తిరిగి సాయం చేయాలన్న
గణేశ్ ఆలోచన సిల్లీగా ఉంది.
బైరాగిని పోలీస్‌గా మార్చడం
మ్యాజిక్కులకే మ్యాజిక్. ఇదంతా ఎందుకు చేసావన్న ప్రశ్నకు సమాధానం ‘బ్యాక్‌గ్రౌండ్
స్కోర్’. సప్తగిరి కుంగ్ ఫు ఫీట్లు,
బాలయ్యను అనుకరించి పృథ్వీ చేసిన అతి
వినోదానికి బదులు వెగటు పుట్టిస్తాయి.
కథని వదిలి జిమ్మిక్కులనే నమ్మకున్న ఈ
సినిమా చూస్తుంటే వెండితెరపై ‘జబర్దస్త్’ స్కిట్లు చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఈ సినిమా కోసం దర్శకుడు మారుతి నెరేటర్‌గా అక్కడక్కడా వినపడినా, దాదాపు పది సినిమాలకు
సరిపడే మాటలను గ్యాప్ లేకుండా చెబుతున్న సునీల్‌ను అసలు నెరేటర్‌గా
ప్రేక్షకులు భావిస్తే, అది ఎంతమాత్రం వారి తప్పిదం కాదు. స్ట్రెస్ తగ్గించడానికి హాస్యనటుడిగా సునీల్ బోలెడన్ని నవ్వులు పంచి ‘సాయం’ చేసాడనుకున్న ప్రేక్షకులు అతడికి తిరిగి ‘సాయం’ చేసి హీరోగా నిలబెట్టాలని ఈ సినిమా చూసిన ప్రేక్షకులు తర్వాతి
సినిమా పోస్టర్ వైపు చూస్తారా లేదా అన్నది అనమానమే. చివరాఖరున
చెప్పొచ్చేదేమిటంటే.. వంకాయలో ‘వన్’, టెంకాయలో ‘టెన్’ ఉండదన్నది
ఎంత నిజమో ‘జక్కన్న’లో ‘ఎంటర్టైన్మెంట్’ లేదన్నదీ అంతే నిజం.
బలాలు
ఛాయాగ్రహణం
సంభాషణలు
బలహీనతలు
కామెడీ లేకపోవడం