టైటిల్ : గుంటూరోడు
జానర్ : మాస్ యాక్షన్ డ్రామా
తారాగణం : మంచు మనోజ్, ప్రగ్యా జైస్వాల్, రాజేంద్ర ప్రసాద్, సంపత్ రాజ్, కోటా శ్రీనివాసరావు
సంగీతం : డిజే వసంత్
దర్శకత్వం : ఎస్ కె సత్య
నిర్మాత : శ్రీ వరుణ్ అట్లూరి
చాలా రోజులుగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న మంచువారబ్బాయి మనోజ్ హీరోగా తెరకెక్కిన మాస్ మసాలా యాక్షన్ ఎంటర్ టైనర్ గుంటూరోడు. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఎక్కువగా ప్రయోగాలే చేస్తూ వస్తున్న మనోజ్, ఈ సారి ఎలాంటి ప్రయోగాల జోలికి వెళ్లకుండా పక్కా కమర్షియల్ ఫార్ములాతో తెరకెక్కిన గుంటూరోడు సినిమాలో నటించాడు. మరి ఈ రోటీన్ ఫార్ములా అయిన మనోజ్ ను సక్సెస్ ట్రాక్ ఎక్కించిందా..?
కథ :
సూర్య నారయణ(రాజేంద్ర ప్రసాద్).. బిడ్డను కంటూ భార్య చనిపోవటంతో ఒక్కగానొక్క కొడుకు కన్నా(మంచు మనోజ్)ను అల్లారుముద్దుగా పెంచుకుంటుంటాడు. తల్లి లేని పిల్లాడని గారాభం చేయటంతో వాడి అల్లరికి హద్దు లేకుండా పోతుంది. ఆనందం వస్తే డ్యాన్స్ చేసేయటం, తన కళ్ల ముందు అన్యాయం జరిగితే అందుకు కారణమైన వాళ్ల తాట తీసేయటం కన్నాకు అలవాటు. పెళ్లి చేస్తే అయినా దారికి వస్తాడేమో అని సూర్యనారాయణ కన్నాకు పెళ్లి చూపులు ఎరేంజ్ చేస్తాడు. కానీ అక్కడ అమ్మాయి ఫ్రెండ్ అమృత(ప్రగ్యా జైస్వాల్)ను చూసి లవ్ చేస్తాడు. ఆమెను ఎలాగైన లవ్ లో పడేయాలని ట్రై చేస్తుంటాడు.
అదే సమయంలో అనుకోని పరిస్థితుల్లో క్రిమినల్ లాయర్ శేషును కన్నా బాటిల్ తో కొట్టడంతో కథ మలుపు తిరగుతుంది. గొడవ జరిగినప్పుడు కన్నా ముఖానికి కేక్ రాసి ఉండటంతో ఎవరు కొట్టారో శేషుకు తెలీదు. తనను కొట్టిన వాడిని ఎలాగైన పట్టుకొని కసి తీరా చంపాలని తిరుగుతుంటాడు శేషు. శేషుతో ఉన్న గొడవ మూలంగానే కన్నా ప్రేమ, తండ్రి సూర్యనారాయణ ప్రాణం రెండూ ప్రమాదంలో పడతాయి. ఈ గొడవల నుంచి కన్నా ఎలా బయటపడ్డాడు..? కన్నా ప్రేమించిన అమృతకు, శేషుకు ఉన్న సంబంధం ఏంటి.? ఫైనల్ గా కన్నాఅనుకున్నది సాధించాడా..? అన్నదే మిగతా కథ.
నటీనటులు :
రాకింగ్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న మంచు మనోజ్ మరోసారి తన రాకింగ్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు. మాస్ హీరోగా తన పరిధి మేరకు సినిమాను నడిపించాడు. భావోద్వేగాలను పలికించటంలోనూ మెప్పించాడు. అయితే మనోజ్ నటనను పూర్తి స్థాయిలో చూపించే బలమైన సన్నివేశాలు లేకపోవటంతో ఉన్నంతలో పరవాలేదనిపించాడు. హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ నటన పరంగా ఓకే అనిపించినా గ్లామర్ షోతో మంచి మార్కులు కొట్టేసింది. ఆవేశపరుడైన విలన్ పాత్రలో సంపత్ రాజ్ మెప్పించాడు, స్టైలిష్ గా కనిపిస్తూనే విలనిజాన్ని పండించాడు. తలపండిన రాజకీయ నాయకుడి పాత్రలో కోట శ్రీనివాస్ మరోసారి తన మార్క్ చూపించాడు. పృథ్వీ, ప్రవీణ్, సత్యలు నవ్వించేందుకు చేసిన ప్రయత్నం పెద్దగా వర్క్ అవుట్ కాలేదు.
సాంకేతిక నిపుణులు :
సినిమాను పక్కా కమర్షియల్ చిత్రంగా తయారు చేసే ప్రయత్నంలో దర్శకుడు రొటీన్ ఫార్ములానే నమ్ముకున్నాడు. పనీపాట లేకుండా ఇంట్లో తిట్లు తినే హీరో, అనుకోని పరిస్థితుల్లో విలన్ చెల్లిని ప్రేమించడం, వెంటబడి ఒప్పించటం.. తరువాత విలన్ తో గొడవ.. ఇలా ఎక్కడా కొత్త దనం అన్నదే లేకుండా సినిమాను నడిపించాడు. తండ్రి కొడుకుల మధ్య భావోద్వేగాలను పండించే అవకాశం ఉన్నా.. దర్శకుడు అలాంటి సీన్స్ కోసం ప్రయత్నించలేదు. సినిమాలో ఎక్కువగా భాగం హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్ మీద నడిపించిన దర్శకుడు క్లైమాక్స్ ను మాత్రం హడావిడిగా ముగించేశాడు. సంగీతం కూడా ఆకట్టుకునేలా లేదు. పాటల విషయంలో పూర్తిగా నిరాశపరిచిన వసంత్, నేపథ్య సంగీతంతో ఆకట్టుకున్నాడు. సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్ :
మంచు మనోజ్
యాక్షన్ సీన్స్
ప్రొడక్షన్ వాల్యూస్
మైనస్ పాయింట్స్ :
రొటీన్ కథ
క్లైమాక్స్
సోర్స్ : సాక్షి దినపత్రిక
Post a Comment